04/08/2023.
పద్య కథా సౌరభం సంకలనం కొరకు ,
సుమతీ శతక పద్యాలు.
అంశం : "సుమతీ శతకం"లో ఒక పద్యం.
శీర్షిక : మనుజ తెలుసుకొనుము మంచి మాట.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల. జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర .
8097622021
-------------------
భద్ర భూపాలుని గురించి.
-----------------------
కాకతీయ రాణి రుద్రమదేవి రాజ్యంలో, బద్దెన,
( భద్ర భూపాలుడు) ఒక చోళ సామంత రాజు.
ఈతడు , రాజనీతికి సంబంధించిన సూక్తులతో -"నీతిశాస్త్ర ముక్తావళి" అనే గ్రంథాన్ని వ్రాశాడు.
తెలుగు సాహిత్యంలో "శతకాలకు" ఒక ప్రత్యేక స్థానం ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో " సుమతీ శతకం" ఒకటి.
ఈ శతకం కుాడా" బద్దెన "రచించినదే .
బద్దెన రాసిన ఈ శతకంలో, ప్రతీ పద్యం చివర "సుమతీ" అనే "మకుటం" వస్తుంది
ఈయన , తన శతకంలో అందరికీ అర్థమయ్యే రీతిలో , సరళ తెలుగు భాషలో,అలతి- అలతి పద ప్రయోగాలతో , అనేక నీతులను, పద్య రూపంలో- తెలియచేసేడు.
" సుమతీశతకం" లోని ఉత్తమమైన ఈ నీతి పద్యాలు ,ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉండడమేగాక ,
వీటిలో కొన్ని పద్యాలనైనా కంఠతం చేయాలి" అన్న విధంగా ఉంటాయి.
ఈ పద్యాల లోని నీతిని గ్రహించి , అందులోని మంచిని ఆచరించడంవల్ల ,మనకు తప్పకుండా ఉపయొాగం కలుగుతుందనే విధంగా ఉంటాయి.
అందులో నాకు నచ్చిన ఒక ఉత్తమ మైన పద్యమిది.
పద్యం :
-------
నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
పద్య భావం :
----------
మానవులంతా జీవితంలో ఎవరితో, ఏ విధంగా ప్రవర్తించాలో, అనే విషయాన్ని బద్దెన ,తన సుమతీ శతకంలోని ఈ పద్యంలో చక్కగా వివరించాడు.
1.మంచిబుద్ధిగలవాడా!
ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు.
2. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు.
3. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు.
4. ఇతరుల మనసుబాధపడేలాగ మాట్లాడవద్దు.
అంటుా, పద్య రుాపంలో తెలియజేసాడు.
ఈ సూత్రాలను పాటించడం, ప్రతిమనిషికీ ఎంతో అవసరమని, పిల్లలైనా ,పెద్దలైనా ,దీనిని అనుసరించవచ్చని బద్దెన చక్కగా వివరించాడు.
ఈ భావాన్ని చిన్నపిల్లలు సైతం అర్ధం చేసుకోవడానికి ,
ఒక చిన్న కధను చెప్తాను వినండి.
-------------------------------------
నీతి కథ.
---------
ఒక ఊర్లో రంగయ్య అనే మోతుపరి రైతు ఉండేవాడు .
అతను చాలా ఉదార స్వభావం కలవాడు.
ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేసేవాడు. కానీ ,
ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.
తనేంటో, తన పని ఏంటో, అంతే....
అతనికి కిష్టయ్య అనే ఒక కొడుకు ఉన్నాడు .
లేక లేక కలిగిన సంతానం కావడంతో, అతన్ని చాలా గారం చేసేది తల్లి.
ఏదడిగితే అది ఇచ్చేది . ఎంత మంకు పట్టు పట్టినా ఏమీ అనేది కాదు. దాంతో మొండితనం ఎక్కువైంది కిష్టయ్యకి.
తండ్రి రంగయ్య మాత్రం ,ప్రపంచంలో బతకాలంటే , మంచి మాట, మంచి బాట ,ఉండాలని, వాటిని అలవర్చుకోమని కొడుక్కి పదే పదే చెబుతూ ఉండేవాడు.
కిష్టయ్య మొండితనం హద్దుమీరి నప్పుడు, రామయ్య రెండు దెబ్బలు వేసేవాడు. దాంతో కిష్టయ్యకు తండ్రి మీదకోపం మరింత హెచ్చింది.
కానీ...తల్లి మాత్రం కొడుకుని వెనకేసుకొచ్చి, దగ్గర తీసుకునేది .దాంతో కిష్టయ్యకు తండ్రి మాట మీద ,కోపం ,నిర్లక్ష్యం పెరగసాగాయి.
ఏ మాట వినేవాడు కాదు. స్కూల్ కి వెళ్ళమంటే ,సమంగా వెళ్లేవాడు కాదు. చెడు స్నేహాలు ఎక్కువయ్యాయి . లేని అలవాట్లకు అలవాటు పడ్డాడు.
ఈ అలవాట్ల కారణంగానే ,చెడ్డ పిల్లలైన రాజు, రంగాలతో డబ్బు విషయమై ,చాలాసార్లు గొడవలు పడ్డాడు.
స్కూల్లో, చెడు అలవాట్లకు లోనైన కిష్టయ్యతో , ఎవరూ ఎక్కువగా మాట్లాడే వారు కాదు .
ఇవన్నీ తెలిసిన కిష్టయ్య తండ్రి మాత్రం, కృష్ణయ్య భవిష్యత్తు గురించి ,చాలా బెంగబడుతూ ఉండేవాడు.
తండ్రి మోతుబారి రైతు కావడంతో, డబ్బుకు లోటులేని కృష్ణయ్య అందరితోనూ పెడసరంగా మాట్లాడుతూ ఉండేవాడు.
తమను ,చీటికి మాటికి గేలి చేస్తూ, అవమాన పరుస్తూ, ఆనందిస్తున్న కిష్టయ్య మీద కోపంతో, అందరూ అతనికి దూరంగా ఉండసాగారు.
స్కూలు రోజుల పూర్తయ్యాయి.
ఈ మధ్యకాలంలో, కిష్టయ్యకు, సిగరెట్లు తాగడం, పేకాడడం వంటి దుర్గుణాలు ఎన్నో అలవాటు పడ్డాయి.
తండ్రి సంపాదించినదంతా, కృష్ణకున్న చెడు అలవాట్ల కారణంగా, ఆరతి కర్పూరంలా హరించుకు పోతోంది.
కిష్టయ్య, తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలెట్టి, ఎందుకూ పనికిరాని వాడుగా తయారయ్యాడు.
ఇదివరకు తల్లి చెప్పిన మాట వినే కృష్ణయ్య , ఇప్పుడు ఆమె మాట కూడా వినడం లేదు.
కృష్ణయ్యకు పెళ్లి వయసు రావడంతో ,తల్లిదండ్రులు కృష్ణయ్య కోసం , పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు . కానీ కృష్ణయ్య కున్న చెడు అలవాట్ల సంగతి, సంపాదనాపరుడు కాడన్న సంగతి తెలిసి, ఎవరూ కృష్ణయ్యకు, పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు.
వయసు ముదిరిపోతున్నా , పెళ్ళికాని కృష్ణయ్యకు, కోపం మరింత ఎక్కువైంది . దాంతో అసహనం పెరిగింది.
అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాజు ,రంగాలు, కృష్ణయ్యను ప్రేమగా తమ దగ్గరకు పిలిచి, తమకు డబ్బు ఇస్తే, అందమైన పిల్లను తీసుకొచ్చి పెళ్లి చేస్తామని కిష్టయ్యతో బొంకారు.
అసలే తన పెళ్లి విషయంలో అసహనంగా ఉన్న కృష్ణయ్య ఎలాగైనా తను ఒక పిల్లని పెళ్లి చేసుకుని, తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ,రాజు రంగాలకు ,ఇంట్లో ఉన్న డబ్బుంతా తీసుకొచ్చి ఇచ్చాడు.
ఆ డబ్బంతా తీసుకున్న రాజు, రంగాలు ,కిష్టయ్యకు పార్టీ ఇస్తామని చెప్పి, రాత్రి భోజనంలో, ఏదో కలిపి తినిపించి, డబ్బులు పట్టుకొని పారిపోయారు.
కల్తీ భోజనం తిన్న క్రిష్టయ్య జబ్బు పడి, నెల రోజుల దాకా కోలుకోలేకపోయాడు.
ఊరు వాళ్లంతా కృష్ణయ్య ఈ విధంగా చెడిపోవడానికి కారణం, పెళ్లి కాకకుండా ఉండి పోవడానికి కారణం, కేవలం , "తల్లిదండ్రులేనని , వారు చేసి గారాబంవల్లే కృష్ణయ్య ఈ స్థితికి చేరుకున్నాడని , అనుకోవడం మొదలెట్టారు.
అన్ని విధాలా దివాలా తీసి, అవమానం పాలైన కృష్ణయ్య తండ్రి ,ఆ ఊరు వదిలి, కుటుంబంతో పాటు, పొరుగూరికి ప్రయాణం కట్టాడు.
అక్కడ కృష్ణయ్య తండ్రి, తనకున్న డబ్బుతో, చిన్న దుకాణం పెట్టుకుని ,అందులోని కృష్ణయ్యను కూర్చోబెట్టి, వచ్చీ , పోయేవారు అడిగే వస్తువులను, జాగ్రత్తగా ఇచ్చి ,డబ్బులు లెక్క చూసి తీసుకోమని , వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడమని, "నోరు మంచైతే ,ఊరంతా మంచిదవుతుంద" ని ,మరీ మరీ చెప్పి , కూర్చోబెట్టాడు.
కానీ , కృష్ణయ్య ఆ పని కూడా సమంగా చేయలేకపోయాడు వచ్చే పోయి వారితో ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకునేవాడు . ఎదుటివారు కొన్న వస్తువుకి, రేట్లు ఎక్కువ చెప్పడం, డబ్బులు ఇచ్చినా " ఇవ్వలేదు" అని దబాయించి మరీ డబ్బులు తీసుకోవడం , వారితో తగువు పెట్టుకోవడం వంటివి చేస్తుండేవాడు. దాంతో దుకాణం దివాలా తీసింది.
కృష్ణయ్య కారణంగా వ్యాపారం దివాలా తీసి, ఆస్తి హరించుకు పోయి, బంధువుల్లో అవమానం పాలైన
కృష్ణయ్య తల్లిదండ్రులు , మనోవ్యాధితో, మంచం పట్టి మనస్తాపంతో , కొన్నాళ్లకు కాలం చేశారు.
కృష్ణయ్య , తల్లిదండ్రులు లేక ,స్నేహితులు లేక , తోడు ఎవరూ లేక, ఒంటరితనంతో మానసికంగా
కృంగి పోయాడు. ఇప్పుడు క్రిష్టయ్యకు, అన్నీ చేసి పెట్టి, కడుపు నింపడానికి తల్లి లేదు . ఏదంటే అది కొని పెట్టడానికి తండ్రి లేడు. ఏ పనీ చేతకాని కిష్టయ్య తన దురుసుతనం వల్ల ఒంటరిగా మిగిలిపోయాడు.
అతనికి. తండ్రి చెప్పిన మంచి మాటలు, పదే పదే జ్ఞప్తికి వస్తున్నాయి.
జీవితంలో బ్రతికేందుకు మనిషి నడవడిక ఎలా ఉండాలో , మాట తీరు , మంచితనం , నలుగురితో కలిసి ,మెలిసి , ఉండడం , ఎవరి మనసు కష్టపెట్టకుండా , స్నేహశీలతతో మెలగడం వంటివన్నీ చెబుతున్న తండ్రి, కళ్ళ ముందు కనిపిస్తున్నాడు.
కానీ ఏం లాభం..?
తనలో మార్పు వచ్చేసరికి తన జీవితమంతా అస్తవ్యస్తం అయిపోయింది.
" తనవారు "అని ,ఎవరూ మిగలలేదు.
రాను రాను, కిష్టయ్య పరిస్థితి చాలా హీనమైపోయింది కడుపు నింపుకోవడానికి కృష్ణయ్య వీధిని పడ్డాడు.
ఇప్పుడు కిష్టయ్య ఎవరైనా ,ఏదైనా, పెడితే తింటాడు. లేకపోతే లేదు .ఎక్కడో పడుకుంటాడు. తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. పిల్లలు కనిపిస్తే మాత్రం, చెడలవాట్లు చేసుకోవద్దని, తల్లిదండ్రుల మాట వినమని, బాగా చదువుకోమని, ఎవరి మనసు కష్టపడేటట్లు మాట్లాడవద్దని పదేపదే చెప్తూ ఉంటాడు.
అంత డబ్బు ఉండి కూడా ,
నోటి దురుసుతనంతో , మొండితనంతో ,తన జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్న " కిష్టయ్య "పరిస్థితి చూసి, చాలామంది తెలిసిన వాళ్ళు" అయ్యో. ఇంత బతుకూ బతికి ,చివరకు ఎలా అయిపోయాడో " అనుకుంటూ ఉంటారు.
ఇదండీ కిష్టయ్య కథ.
ఈ కథ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ... పిల్లలను అవసరానికి మించి ముద్దు చేయొద్దు. వారికి కష్టం- సుఖం అనే ,ఈ రెండింటి గురించి ,చిన్నతనం నుండే తెలియజేసే విధంగా మనం ప్రవర్తించాలి.
పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వెనకేసుకురావద్దు.
పిల్లలు అడుగుతున్నారు కదా అని ,ముద్దుతో వాళ్లకి ఎప్పుడూ డబ్బులు ఇవ్వొద్దు.
పిల్లల విషయంలో మాత్రం తల్లి తండ్రి , ఇద్దరూ కూడా బాధ్యతగా మెలగాలి.
పిల్లల్ని , మీరు స్కూల్ కి సమయానికి పంపించినా, వాళ్లు స్కూలులో ఏం చేస్తున్నారు అన్నది, వారం ఒక్కసారి అయినా గురువులను కనుక్కుంటూ ఉండాలి.
పిల్లల నడవడిక మాట తీరు మంచిగా ఉండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు తగురీతిలో ప్రవర్తించాలి.
ఇన్ని మంచి సందేశాలు ఇస్తున్న పద్యాలు ఎన్నో, ఈ సుమతి శతకంలో ఉన్నాయి. అందరూ చదవండి చదివించండి.
మరోసారి, మరో పద్యంతో కలుసుకుందాం .
"శుభం".
******************************************