Saturday, September 14, 2013

కవిత..ఎర్రగులాబీ..

"ఎర్రగులాబీ". 

______________

  

". 






శీర్షిక :ఎర్రగులాబీ

అక్కడ ఉందో గులాబీ తోట 
అందమైన పూలతో విరబూసి
పచ్చని ఆకులతో
 కళకళ లాడుతూ ...... 
చిగిర్చిన చిరు కొమ్మల 
లేలేత పలకరింపులతో 
సేదతీర్చే మత్తైన పరిమళం 
వికసించే పూల వికాస మాధుర్యం 
ఆస్వాదించే తోటమాలి కన్నుల్లో 
కదలాడే జ్ఞాపకాల కలకలం ॥ 
చిన్నారి గులాబీ కొమ్మను 
చిగురింపచేయడానికి 
తపనతో పడిన శ్రమ 
గొప్పులు తీసి ,నీరు పోసి 
కంటికి రెప్పలా కాచే క్షణాలు 
కొమ్మ చిగిర్చిన రోజు 
పులకరింపుతో చిందులేసే 
సంతోష  తరంగాలు ,
అందరికి వినిపించిన 
ఆశల సరాగాలు 
కన్న  కలల 
ఆనంద సౌధాలు ॥ 
మొగ్గ తొడిగిన గులాబీలు 
వికసించిన రోజు 
శ్రమ పడిన శరీరం 
సేదతీరిన ఆనందపు గగుర్పాటు ॥ 
ప్రాణానికి ప్రాణంగా 
పెంచుకున్న ధనం 
చెట్టుపై పెరిగిన మమకారం 
అందని ఎత్తుకు ఎదిగి 
అరవిరిసిన అందం 
తన సొంతమనే గర్వం ॥ 
అందుకుందామన్న ఆతృతలో 
ఆకులచాటున దాగిన ముళ్ళు 
కసుక్కున గుచ్చుకున్నప్పుడు 
తన్నుకొచ్చిన బాధా వీచిక ....  
ఓర్పు నిండిన కంటి తడిలో 
మసకబారిన పూల రంగు 
చివ్వున చిందిన రక్తానికి 

ప్రతీకగా ........." ఎర్రగా" .... 

విచ్చుకున్న"  ఎర్రగులాబీ "
ముళ్ళమధ్య ఎత్తుగా కనిపించింది 
జీవిత సత్యాలకి చిహ్నంగా .... 
_______________________________






కవిత..వ్రధ్ధాశ్రమం.

       "వృద్ధాశ్రమం". 

___________________________
జరుగుతున్నదక్కడో సమావేశం ......... 
కాన్తిహీనపు కన్నుల్లో
 కరడుకట్టిన కన్నీటి పొరలు 
కాలచక్రం కింద నలిగిన
 బాదాభరిత భాష్యాలు 
గడచిన జీవితపు అచ్చట్లు 
,పిల్లల పెంపకాల ముద్దు-ముచ్చట్లు
కష్ట్తాల  కావిళ్ళ తట్లు
అప్పుల బాధల అగచాట్లు 
జీవిత నైరాశ్యపు నగుబాట్లు,
కల్లలైన కన్నీటి నిట్టూర్పు కోట్లు 
ఒకరి బాధ ఇంకొకరికి చెప్పుకొని 
,తృప్తి పొందే ముసలి జట్లు 
అవే వారి మనస్సుకు
 తీర్పునిచ్చే టాబ్లెట్లు 
బడలికతో వడలిన దేహాలు
బందింపబడ్డ బతుకు భారాలు 
నలిగిన  మనసుల్లో
 నాటుకున్న నైరాశ్యం 
ముడతలుపడ్డ ముఖాల్లో
నాదంటూ లేని దైన్యం 
వెలసిన రాతి బీటల్లో
గూడు కట్టుకున్న కన్నీటి గాధలు 
ప్రతీ జీవితానికి ఒక కధ
ప్రతీ కధలోనీ తీరని వ్యధ 
కధల కలం నుంచి వెలువడిన
రంగుల రాతలతో వెలసిన
" వృద్దాశ్రమం" బోర్డ్ 
మట్టి కొట్టుకుపోయిన మమకారంలా
మసిబారి , వెల-వెలబోతోంది 
మారని మనస్సుల కరకు నిర్ణయాల 
" కఠినాస్త్రం " లా .... 
________________________
రచయిత్రి , శ్రీమతి ,జగదిశ్వరిముార్తి.కల్యాణ్.













 








Tuesday, September 10, 2013

కవిత..పుాబాల

"పూబాల "

---------------

( ఆడపిల్లలకి రక్షణ కల్పించండి )

శీర్షిక
అందాల పుాబాల.
-------------------------

అందాల పూబాల వికసించే పరువాల 
కలువకన్నులతోడ చూచె  నాడ  ఈడ 
వింతగా కనురెప్పలు విప్పీ వివరంగ చూచి 
ఎంతగానో మురిసే వనమంతా పరికించి ॥ 

ఆ తోటలో పూలు రంగు వలువల చెలులు 
వలపు వింజామరల పంచె సౌరభములు 
మొగ్గ తొడిగిన సాటి ముద్దు బాలలతోటి 
కవ్వింత,తుళ్ళింతలాడి పాడెను కలసి ॥ 

అంత  నరుదెంచెనా తోట వనమాలి 
పూలబాలల తెంపె  వాడు దయమాలి 
విరిసి విరియని పూల చేర్చె నంగడిలోన 
వెలగట్టి తెగనమ్మే కరకు సందడితోన ॥ 

చిదిమే కొందరు వాని నలిపే భోగులు మేని 
కొన్ని చేరెను బలికై   ఎన్నో నలిగెను చితికి 
కన్నీరై  మున్నీరై  వాడి నలిగిన  బేల 
ఏల పూచితి ననుచు వగచె విరిసిన బాల ॥ 
_______________________________
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------