అంశం: అడవి జంతువులు (గేయం).
శీర్షిక : మా బాధలు కనరండి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
కళ్యాణ్ : మహారాష్ట్ర.
పల్లవి:
-----
అడవిలో పుట్టాము అడవిలో పెరిగాము
ఆనంద తీరాల ఆడాము పాడాము ॥
అనుపల్లవి :
--------
చీకుా చింతా లేని జీవితాలు మావీ
మాజంతు జీవాలకు సాటిరావు ఏవీ ॥అడవి ॥
చరణం :
------
సాధు జంతు జీవాలము, కలసి మెలసి ఉంటాము .
జాతి మతముల జోలికి పోమే పోముా
కలసి నీరు తాగుతాం ,కలివిడిగా మసలుతాం.
అడవి యంతా తిరిగి అలసి సొలసి వాలుతాం ॥
చరణం :
------
క్రుార జంతు బంధులున్న , కుటిల బుద్ధి లేదుా
ఆకలైతేగానీ, దరికి చంపగ రావుా
స్వార్ధమన్నది లేదు పాచి కుాడు నవి తినవుా
వలసినంత మాత్రమె తిని, మిగులును వదలేసి పోవు ॥
చరణం :
------
ఆశ నిండు విసపు మనిషి ఎదుటివాణ్ణి దోచే,
స్వార్ధ చింతనలు జేసి , నమ్మువారి రోసే
మానవత్వమే మరచే మనిషి మనిషినే కోసే,
జాతి భేదముల పేరున రాజకీయములు జేసే ॥
చరణం :
------
మేడ, మిద్దెలు కట్టగ మనిషి యడవి కోసే
జంతువులను చంపి అమ్మి , సొమ్ములెన్నొ దాచే
బ్రతుకు తెరువు పేరుతో బంధనాలు వేసే
గారడీలు చేయించి, మా కడుపులు మాడ్చే॥
చరణం :
------
చిలకల మేల్కొలుపు లేదు, కోయిలమ్మ పాటలేదు
నెమలి కన్నెలాట లేదు , పుా బాలల శోభ లేదు
పచ్చదనపు వాడ లేదు, కొండ చాటు నీడ లేదు
ప్రకృతి పడతి ఎండి పోయె, భరత మాత క్రుంగిపోయె॥
చరణం :
------
బ్రతుకు తీరు బరువై , వాసములే కరువై
రోడ్లు జేరు మమ్ము జంపె, మనిషి క్రుార మృగమై
మాస్థానము దోచీ , సంకెళ్ళను వేసీ
తోలు తీసి అమ్మకున్న మనిషి బ్రతుకు ఛీ ఛీ ॥
------------------------------------
No comments:
Post a Comment