108 ఇష్టపదులు.
--------------------------.
సర్వ దేవతా ప్రార్ధన.
1.గణపతి వందనం.
------------------------
1.
అంబ ఈశుని పుత్ర ఆది పుాజ్యుడవయ్య
అహరహము నిను గొల్తు నార్తిబాపగదయ్య
ఆది -అంత్యము లేని ఆది గురుడవు నీవు
అర్చించు నీశ్వరికి ఆపదలు బాపయా ॥
2.
ముజ్జగమ్ముల ఒజ్జ ముద్దు గణపతి రాయ.
విఘ్నముల బాపేటి విఘ్నేశ్వరుడవయ్య
ఇష్టపదులను రాయు ఇచ్ఛ దీర్చగ రార
ఈప్సితములీడేర్చి ఈశ్వరిని బ్రోవరా ॥
2.గురు వందనం.
.---------------------
3.
శ్రితజనుల బ్రోవగా శిరిడీ పురమునందు
శ్రీశ నీ వాసమే శ్రీ నిలయమై ఒప్ప
సర్వ మత సమ్మతిని సరళముగ జెప్పేవు
సకల తీర్ధములన్ని నీదరినె జుాపేవు..॥
4.
ఖండయొాగివి నీవు ఖలు సంతరణ జేయు
కరుణా సముద్రుడవు కమలనయన సునేత్ర
కలత లన్నియు బాపి కావుమయ్యా మమ్ము
శ్రీ షిరిడి శ్రీ వాస శ్రీ పదాంబుజయుగళ ॥
5.
వందనము శ్రీసాయి వందనము గురుదేవ
వందనము చేకొనగ వేగ రావగదయ్య
వేడుచుంటిని నిన్ను వేల కీర్తుల తోడ
వరద హస్తముతోడ వరలు సాయిాశ్వరా ॥
6.
నింబ వృక్షము నీడ నిత్య తపమును జేసి
సర్వ జన సమ్మొాద సామరస్యపు భావ-
మలరు సాయిాశ్వరా మా నమము నీకయా
ఇల గాచు ఇలవేల్ప ఈశ్వరిని బ్రోవరా..॥
3.సరస్వతీవందనం.
------------------------
7.
విద్యలకు కొలువైన విలువ పలుకుల తల్లి
విజయ పథములేలు విశ్వ జన శ్రీ వల్లి
విద్య- బుద్ధుల నెల్ల విశ్వ వేదిక కొసగు
తల్లి శారద నీవె తరుణి బ్రాహ్మ్మీ శివే ॥
8.
నా పుాజలను కొమ్మ నగుమొాము పుాబోణి
వివరములు నాకొసగు విజయ పథ సామ్రాజ్ఞి.
నాదు జిహ్వను నిలచి నను బ్రోవు మాయమ్మ
నలువ కొమ్మా నిత్య నీరాజనములమ్మ ॥
4.అంబికా వందనం.
------------------------
9.
గణ నాధ షణ్ముఖా ఘన పుతృలకు తల్లి
గణనలే లేనట్టి గుణ కల్పవల్లివిగ
గౌరవర్ణముతోడ గౌరివై భాసిల్లు
ఘన సింహ వాహినీ గావు ఈశ్వరి నిలను ॥
10.
దుష్టులను , దైత్యులను దునుమాడి గాచేవు
దశరుాపములతోడ ధరణిలో వెలసేవు.
దివ్య శక్తుల నేలు దీనార్తులను బ్రోవు
ఈశ్వరీ నుత పాద ఈశు రాణివి నీవు. ॥
11.
హిమగిరిసు పుత్రికవు హిమగిరి పురీశ్వరివి
హరుని పట్టపురాణి హరి భగిని పార్వతివి
హంస వాహిని సఖివి హరునర్ధరుాపిణివి
అంబ, జగదీశ్వరిని అహరహము కావవే॥
----------------------------
భగవద్గీత -ఆరంభము.
------------------------------------
12.
1.అర్జున విషాద యొాగము.
--------*-------:-----------------------
ధర్మ క్షేత్రమునందు ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన పరమేశుడవునీవు.
స్వఫలా పేక్ష కై స్వజన సంహారమ్ము
జేయనని పార్ధుడదె ధ్యేయమును విడనాడె ॥
13.
వేద సారము మెండు వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత కావ్య ఘనుడవునీవు
శ్రీ కృష్ణ రుాపాన శ్రితునర్జునకు నీవు
ఘనయొాగ ములనెంచి గీత బోధించేవు. ॥
14
నిఖిల లోకోధ్భవుడ నిత్య పరమానంద
నిజ కర్మ ఫలములకు నీదె బాధ్యతటంచు
నిస్సహాయత తోడ నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ ఫలము నెరిగించేవు.॥
15.
2. సాంఖ్య యొాగము.
--------------------------------
పుట్టి -గిట్టుటె రీతి పుడమి యందనుచునుా
శాశ్వతము ఆత్మనుచు శంకలనుబాపేవు.
శోత్రుడవు నీవనుచు శోకింప తగదనుచు
సాంఖ్య యొాగపు నామ శాస్త్ర మును తెలిపేవు ॥
16.
3. కర్మ యొాగము.
-------------------------
జ్ఞానమ్మె శాస్త్రమని జ్ఞానివై మెలగుమని
కర్మ ఆచరణ లిల ఘన లోక హితములని
కర్మలకు బాధ్యుడవు- కర్త నీవని తెలిపి
జగతి కర్మల సలిపి జయమొంద మంటివి ॥
17.
4.జ్ఞాన , కర్మ సన్యాస యొాగము.
---------------------------------------------
పెక్కు జన్మలు నీవి పెక్కు అవతారములు-.
పేర్మి నెత్తితి నేను పెకిలింప పాపములు.
నాల్గు వేదములైన నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా నటన సుాత్రధరుడను ॥
18.
అజ్ఞాన మును వీడి అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే కడు శ్రేష్టమని యెంచి
కర్మ తత్వమునెరిగి కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవౌ -- ఉత్తమంబెరిగి ॥
19.
5.కర్మ సన్యస యొాగము.
-----------------------------------
ఏ కాంక్షయుా లేని ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె కాంచ ఫల రుాపమ్ము.
జ్ఞాన యొాగపు ఫలము కర్మ యొాగపు ఫలము
ఒక్కటిగ చుాడుమా ఒనరు భావముతోడ.॥
నిష్కామ కర్మములు నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను శాంతి పొందెదరు.
సర్వత్ర సమభావ సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ నిర్వాణ పాత్రులు॥
No comments:
Post a Comment