09/10/2023.
తపస్వి మనోహరం "ఈ బుక్ " కొరకు,
అంశం : గీతా సారం.
శీర్షిక : నిన్ను నువ్వు తెలుసుకో..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
ఈ జగతిలోప్రతి మనిషి పుట్టుక కర్మానుబంధమే.
ఈ భూమి ఒక కర్మ క్షేత్రం.
చేసే కర్మను అనుసరించే మనిషి బుద్ధి కూడా ఉంటుంది.
ప్రతి మనిషి జీవితమూ, , కష్ట-సుఖాలు, సుఖ-దుఃఖాలు నిండిన ఒడిదుడుకుల ప్రయాణమే.
ఈ ప్రయాణంలో కష్టానికి గాని, సుఖానికి కానీ, వెరవకుండా,
కష్టాన్ని భరిస్తూ, సుఖాన్ని ఆస్వాదిస్తూ రెండింటి మధ్యలో దేనికి చలించకుండా , తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నవాడు, స్థితప్రజ్ఞుడు అనబడతాడు.
అటువంటివాడు అన్ని పరిస్థితులకు ఎదురీది నిలబడగలడు.
----------
కష్టానికి భయపడుతూ, పరిస్థితులకు ఆందోళన పడుతూ,
బ్రతుకు ప్రయాణాన్ని భారంగా నడుపుతున్న వారికి అన్ని భయాలే, అన్నీ ఆందోళనలే .
నాది, నా వాళ్లు , నా బంధువులు, నా కుటుంబం, అన్న చోట స్వార్థం నిండి ఉంటుంది .
కొందరిలో ఈ స్వార్థం ఎంతవరకు దారితీస్తుందంటే,, నా వాళ్లు, అనుకున్న ప్రతి ఒక్కరి తప్పులను ,కప్పిపుచ్చుతూ, వారి మీద ప్రేమతో, అవమానాలను ఎదుర్కొంటూ, ఆందోళకరమైన బాటలో అశాంతి పాలవుతూ ,ఆత్మవంచనకు లోనవుతూ
ఆత్మశుద్ధిని కోల్పోయి అధోగతి పాలవుతారు.
మరికొందరు చిత్తశుద్ధితో," మేము, మనము, "అన్న బాటలో నడుస్తూ, అందరి పట్ల సమాన దృష్టితో వ్యవహరిస్తూ,
సత్యం, ధర్మం ,శాంతి అనే బాటలో , నిశ్చల నిర్మలత్వానికి ప్రతీకలై , చిరకాల "కీర్తులై " ఆ చంద్రార్కం, అందరి మనసుల్లో నిలిచిపోతారు.
-------
ప్రతి మనిషి జీవితమూ, ఒక గెలుపు పోరాటమే.
ఈ ,"నీ "పోరాటంలో "నా "అన్న వారు ఎవరూ నీకు తోడు రారు.
కానీ నీ "గెలుపు "జీవితంలో, భాగస్వాములు మాత్రం అవుతారు.
అదే "మనమంతా ఒక్కటే" అంటూ, నడిచిన బాటలో, అందరూ నీ వారే . వారంతా నీకు తోడే.
ఇక్కడ "ఏది మంచి, ఏది చెడు" అన్న విశ్లేషణ చేసుకుంటూ పోతే, నీ ,నా ,బంధాలు కనుమరుగవుతాయి .
అక్కడ ఒక ధర్మం, న్యాయం, మాత్రమే బంధమై నిలిచి ,నీకు బలమై నడిపిస్తుంది.
ఈ పోరాటంలో ధర్మం గెలుస్తుంది .
అధర్మం నాశనం అవుతుంది.
ఆత్మ శుద్ధితో చేసే నీ పోరాట ఫలితం, పరమాత్మగా నిన్ను నిలుపుతుంది .
అప్పుడు నీ ఆత్మే, పరమాత్మ స్వరూపమై నిన్ను , నన్ను. , అందరిని , నడిపిస్తుంది.
ఆ నువ్వే ,భగవత్ స్వరూపానికి ప్రతిరూపమై, నువ్వు ఆడే ప్రతి మాట "భగవద్వాక్య" మౌవుతుంది.
అటువంటి పలుకుల సారమే " లోక కళ్యాణ కారణమై",
జగతిలో వెలుగులను ప్రసరించే " భగవద్గీతగా"
ఆమోదించబడి, ఆచరించబడుతుంది..
దీనిని అనుసరించిన మానవ జీవితం, పాప
ప్రక్షాళనమై "ధన్యం" అవుతుంది.
--------------
"భగవద్గీత "అంటే కురుక్షేత్రంలో, శ్రీకృష్ణుడు, అర్జునుడికి బోధించినది మాత్రమే కాదు.
మన నిజ జీవితంలో,
భక్తి , జ్ఞాన, వైరాగ్య, కర్మ, యోగాలకు నిలయమైన, మన" సాంప్రదాయ సంపదలై" , మనకు నిత్యం మార్గదర్శకం చేస్తునే ఉన్నాయి.
పుట్టిన ప్రతి మనిషి జీవితానికి కొన్ని పరిధులుంటాయి.
ఆ పరిధులే నీతి ,న్యాయం , ధర్మం, బుద్ధి, వివేకాలతో
నిండి ఉన్న మన సభ్యత , సంస్కారాలు .
అవే మనిషి వ్యక్తిత్వాన్ని , నడవడికని శాసించే "గీత"లు.
ఆ" గీత"ను దాటనంతవరకు, మనిషి తన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ , అదే ఆనందాన్ని పదిమందికి పంచగలిగే "పరమాత్మ స్వరూపుడౌతాడు.
---------
అదే మనిషి " గీత దాటితే" రాక్షసత్వం నిండిన దశ దుష్ట అహంకారాలకు బానిసై,
తన వినాశనానికి తానే కారకుడైన రాక్షసాధముడౌతాడు.
---------------------------------------------
ప్రక్షాళింపబడిన మన ఆత్మయే "భగవత్స్వరూపం"
ఆ భగవంతుడి నోటి నుండి వెలువడే పలుకుల సారమే
"భగవద్గీతా సారం".
ఈ విషయాన్ని అర్థం చేసుకుని" నిన్ను నువ్వు తెలుసుకోగలిస్తే"
నీలో ఉన్న ఆత్మే , పరమాత్మ స్వరూపమని గ్రహించగలవు.
-----------------
No comments:
Post a Comment