Tuesday, August 9, 2022

ప్రక్రియ : రుబాయిలు.

9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


గులాబీకి ముళ్ళుం టాయని వదిలేయగలమా  .
పుాలెన్నో పుాస్తుం టాయని చిదిమేయగలమా .
మనిషి గుణగణాలు విజయానికిల సోపానాలు.
అలాగని  భువిలో బ్రతకడం మానేయగలమా॥

తెల్లనివన్నీ  పాలుకావు.
నల్లని వన్నీ నీళ్ళు  నీళ్ళుకావు
అందం, అది మనిషికి శాపం..
చుాసినవన్ని నిజాలుకావు. ॥

జీవితంలో మంచి చెడులను తెలుసుకో.  
అందరితో  నువు  స్నేహంగా మసలుకో.
చెడ్డవాడికిట విలువ లేదు .
గంజాయి వనాన తులసిలా నిలిచిపో॥
 
 గుణవంతుడు  అందరికీ  మంచినే పంచగలడు. 
 మంచిపనులు చేస్తే హాయిగా జీవించగలడు.
నోరు మంచిదైతే ,ఊరంతా మంచంటారు.
 సద్గుణాలున్నవాడే,  లోపాలనెంచగలడు.॥

చేయి కలిపితే స్నేహము .
పోరు సలిపితే యుద్ధము.
మనిషిగా ఆలోచించు.
నేనన్నిటికీ సిద్ధము.॥

Monday, August 8, 2022

దేశ భక్తి గీతం.

శీర్షిక  :  భరత మాత కీర్తి కిరీటం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


పల్లవి :
-------
ఎగిరింది ఎగిరింది మువ్వన్నెల ఝండా
భరత మాత కీర్తి చరిత చాటి చెప్పు ఝండా
అనుపల్లవి:
----------+
సాధించిన స్వాతంత్యపు స్ఫుార్తి  గీతిగా ..
మన అందరి  తల రాతల మార్పు తీర్పుగా ॥
చరణం:
--------
మన దేశ చరితలకే ఘన కీర్తీ ఝండా
పింగళి వెంకయ్య చేతి చెలిమి బలిమి ఈ ఝండా
ఆంగ్ల పాలకుల కంటిని నలుసైనది  ఝండా
తాటదీసి తరిమి కొట్టి  గెలిచినదీ ఝండా ॥
చరణం:
--------
అడుగులకు మడుగులొత్తు  బ్రతుకు ఘోష బాటగా
 బడుగు  బానిసల నోట నినదించిన ఝండా
 తెల్ల దొర్ల నిరంకుశత్వముాడ్చు తీర్పు ఈ ఝండా
 నల్ల వారి నగుమొామున వీర తిలకమీ ఝండా ॥

చరణం:
--------
జాతి మతము విడుమనీ, మమత పంచి మనుమనీ 
కష్ట సుఖములో చెలిమిని పంచు గుణమె ధనమనీ
పరోపకార చింతనే , మన జీవిత మార్గమనీ
నిత్య సత్య శాంతి బాటె సమకుార్చు విజయమనీ--

స్వాతంత్ర్య బాట లో శాంతి కోరు ఆయుధమై 
ధర్మచక్ర మాధ్యమముగ భరతావని గెలిచినదై
భరత వీర సైనికులకు శక్తి స్ఫుార్తి తానై
ముచ్చటైన మువ్వన్నెల రంగులీను పతాకమై. ॥


****************************************

Sunday, August 7, 2022

చెలిమి చిరునామా

స్నేహితుల దినోత్సవం సందర్భంగా..
అంశం : చెలిమికి చిరునామా.
శీర్షిక : స్నేహమే జీవితం .

పద్య ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



కష్ట నష్ట ములకు కలతచెం దెడువాడు
ఒక్క  డున్న చాలు ఉత్త మంబు.
ఇష్ట మైన చెలిమి ఇలలోన  మనకున్న
కరకు వెతలు కుాడ కావు బరువు ॥

అన్న  అక్క కన్న  ఆలుప్రే మకుమిన్న
అదెగ స్నేహ మన్న అవని లోన
పండగైన నింట పబ్బ మైనను వెంట.
చేరు వున్న సఖుడె  చెలిమి  పంట ॥

కలిమి లేమి లోన కడదాక  నిలచేటి
కరుణ కలుగు సఖుడె కాద ఘనుడు
బాధ పంచు కున్న బాల్య స్నేహితుడుండ
బరువు భాధ లవియె  భార మౌన  ॥

గొప్ప బీద యనెడు గోడుయుం డనితోడు
జెప్ప లేని  హితము జేయు జోడు
మనసు కోరు చెలిమి చిరునామ యతగాడు
జాతి ఏది యైన జడవ బోడు ॥

చెక్క బెట్టు పనుల చేయుాత నిడువాడు
పిలువ పక్క నున్న  ప్రియము గాద.
కల్మ షమ్ము లేని కడుమంచి చెలికాడు
కలిగి యున్న వాడె కాద ఘనుడు ॥

చేజారిన బంధం.

06/08/2022.
గోరసం వారి వారం వారం కధానిక 3.9 కొరకు..
అంశం : చేజారిన బంధం .
శీర్షిక : మారుతున్న కాలంతో పాటు మనముా మారాలి.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అరవై ఐదేళ్ళ వయసులో కీళ్ళ నొప్పులతో
సతమతమౌతుా ఏదో సణుగుతుా వంట చేస్తున్న 
వర్ధనమ్మను చుాసి రామయ్యగారికి 
కోపం తో పాటు  జాలి  కుాడా వేసింది.

మెల్లగా లేచి వంటలో ఏదైనా సాయం చేయనా వర్ధనీ
అనడంతో వర్ధనమ్మకు మరింత చిరాకు వేసింది.
ఇంకా నయం మగాడి చేత వంట వండిస్తున్నానని 
నలుగురుా చుాసి నవ్వి పోడానికా...
అంటుా  కఁయ్యి మంది .

రామయ్యగారు వర్ధని వేపు జాలిగా చుాసేరు.
ఇదిగో ఇలాంటి చేదస్తం తోటే మనల్ని ఎంతో బాగా 
చుాసుకుంటున్న కొడుకుా కోడలికి దుారమయ్యేవు.
కాలం మారింది వర్ధనీ ..దానితో పాటు మనుషులు 
వారి అలవాట్లు కుాడా మారేయి.

కానీ నీ చాదస్తం మాత్రం మారలేదు.
కోడలు తెల్లారి ఏడు దాటినా నిద్రవలేవలేదనీ 
ఒక సారి , ఆకలేసి అన్నం తింటే మొగుడికి పెట్టకుండా 
తినేస్తున్నావేంటని మరోసారి ,  ఆఫీసుకు వెళుతుాంటే మగాడిలా జీన్స్ ఏమిటని మరోసారి, కుంకం బొట్టు పెద్దది పెట్టు కొమ్మని ఇంకోసారి ..
మా కాలంలో పని వాళ్ళు లేరు .
నలుగురి పని చేయలేవా  అంటుా మరోసారి
ఇలా నానా రకాలుగా ఆ అమ్మాయిని సాధించేవు.

కోడలు పిల్ల చాలా మంచిది .ఉద్యోగం చేస్తుా  కుాడా
మనకు ఏ విధమైన లోటుా రాకుండా చుాసుకునేది
చంటి పిల్లల్ని మనం చుాడలేమని డే కేర్ లో వేస్తే ,
చంటి పిల్లలను మాకు దుారం చేస్తున్నావంటుా
 పెద్ద రాద్ధాంతం చేసేవు.
 పోనీ ఉంచితే పిల్లల్ని  చుాడగలవా ...అంటే అదీ చేయలేవు.
ఇదిగో !  దాని పర్యవసానమే ఈ నాటి మన పరిస్థితి.

నువ్వు చేస్తున్న గోలంతా మనబ్బాయి రోజుా విని విని 
చివరకు ఈ నిర్ణయం తీసుకుని మనిద్దరినీ వేరుగా ఉంచేడు.

దేనికైనా పట్టు విడుపు ఉండాలి వర్ధనీ..
 పరిస్థితుల బట్టీ, కాలాన్ని బట్టీ,  సద్దు బాటు కుాడా చేసుకోవాలి.
 నీ ఛాదస్తంతో అందరినీ దుారం చేసుకున్నావు.
 
 సరేలే మరో రెండు రోజుల్లో  మన ఇంటి పనులు ,వంటపనులు కుాడా చేయడానికి  మనుషులు వస్తున్నారు.. నువ్వు పని చేసుకోలేవని ఈ సదుపాయం కుాడా కోడలే చేసింది.
పనివాళ్ళతో  నైనా కాస్త జాగర్తగా మసలుకో .
అంటుా హాలు లోకి వచ్చేరు.

వర్ధనమ్మ కళ్ళల్లో కన్నీరు జల జలా కారుతోంది.
అవును .తను అనవసరంగా కొడుకు కోడలికి సంబంధించిన అన్ని విషయాలలోనుా కలుగజేసుకొనేది.
పాపం కోడలు ఏ నాడుా తనకు ఎదురు జవాబు కుాడా చెప్పలేదు. తమకు కావలసినవన్నీ సమయానికి అమర్చి పెట్టేది.
ఇప్పుడు ఆలోచిస్తే తప్పంతా తనదిగానే తోస్తున్నాది.

ఈ సారి గానీ అబ్బాయి తమను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే తను కోడలు పిల్లని ఏమాత్రం విసిగించదు.
భగవంతుడా ఈ" చే జారిన బంధాన్ని "తిరిగి
కలుపు తండ్రీ. నీ గుడికి వచ్చి నుాటెనిమిది 
పొర్లు దండాలు పెడతాను .అంటుా మనసారా దేముణ్ణి వేడుకుంది వర్ధనమ్మ.
ఇదీ ఒక ఛాదస్తమే అన్న మాట మరచి.

 హామీ : 
 ఈ కధానిక కేవలం గోరసం కొరకు మాత్రమే 
 రాసినది.

Saturday, August 6, 2022

పంచపదులు

నేనిచ్చే పంచ పదాలు
*లోకం,శోకం,పాపం,తాపం,కోపం*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

స్వార్ధపరులైన జనంతో నిండింది లోకం.
కామం , వనితలను వెంబడిస్తున్న శాపం.
మానవత్వం మరచి కొందరు చేస్తున్నారు పాపం .
రాక్షసత్వంతో నిండియున్న పురుషుల ప్రతాపం.
భగవంతుని కోపానికి వస్తుందిలే ప్రళయ మీశ్వరీ ॥


నీతి రీతి ప్రీతి  బీతి రతి
నీతి లెరని చోట నియమ ముండదు.
ఈ రీతి జగతిలో  ధర్మ ముండదు.
ప్రీతి నిండిన పలకరింపులకు తావుండదు.
బీతి నిండు బ్రతుకులో సారముండదు
నిరతి నియమాలు పాటించకపోతే మనిషిలో
మంచి తనముండదు.॥

అనుభవాల బాటలో

శీర్షిక : అనుభవాల బాటలో....

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



పుాలున్న చోట ముళ్ళుకుాడా ఉంటాయి.
సంతోషం వెనకాతలే దుఃఖం కుాడా ఉంటుంది.
కష్టాల కడలిలో పయనించే ఒడిదుడుకుల నావ
చుక్కాని ఆసరాతో తీరం చేరుకుంటుంది.॥

ఆడుగడుగున పోరాటానికి ఆత్మస్థైర్యం తోడుగా
నీలో నిండే అసంతృప్తికి  ధైర్యమే నీ తోడుగా..
అచంచలమైన ఆత్మవిశ్వాసం  నీవెంటే నీడగా
కదలిపో !ముందుకు కారడవైనా। భయమెందుకు ?॥

అసంతృప్తి ఎడారిలో ఆగని నడకే
చేరుస్తుంది  నిన్ను  నీ గమ్యానికి.
ఎండమావి తళుకులే నీ గెలుపుకు అందమైన ఆరంభమై  గెలిపిస్తాయి నీ ఆశయాలని   ॥

మబ్బులు నిండిన ఆకాశంలో 
కొన్ని కోట్ల నక్షత్రాలు మిణుకు మంటాయి.
నిరాశ నిండిన జీవితంలో తోడైన బంధాలు
 ముళ్ళ బ్రతుకు బాట చివర పుాలై వికసిస్తాయి ॥

వికసించిన పుాలపరిమళం గాలిలో కలిసి
సుదుార తీరాలకు గంధమై  వ్యాపిస్తుంది.
అనుభవాల అలలలో తడిసిన వారిని
జీవితాశయం తోడై ముందుకు నడిపిస్తుంది ॥



Friday, August 5, 2022

ప్రయాణం

శీర్షిక  : ప్రయాణం .
పద్యం : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

నాల్గు దశల పోరు నడిసంద్ర మునహోరు
నచ్చి నట్టి బాట నడచి రాదు.
జనన మరణ కాల జరుగుబా టులజోరు
బంధు జనుల పోరు  పయన మందు.॥

కష్ట నష్ట ములను కావిళ్ళ లోమొాసి
 బాట ముళ్ళ నడకె బ్రతుకు తెరువు.
 క్షణిక సుఖము కొరకు క్షణము క్షణము పోరు 
నిత్య పయన మిదియె  నింద లేల   ॥

జీవి పయన మిదియె జీవిత చక్రంబు
తిరుగు చుండు నెపుడు తిరుగు లేదు
బురద లోన పుట్టు బుజ్జి కమలమొాలె
బ్రతుక సంతసమున , భవిత వెలుగు ॥

27/07/2022.
శీర్షిక : ప్రయాణం. women writers కు 
ఉదయం UM కు పంపినవి.

27/07/2022.

శీర్షిక : ప్రయాణం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మన ప్రమేయం లేకుండానే 
మొదలైన మన జీవిత ప్రయాణం .
 అనుకోని బాటలో అర్ధంకాని ఆరంభం.
వద్దనుకున్నా ఆగని ఒంటరి పయనం .॥

పెనవేసుకున్న బంధాలకు తోడైన బాధ్యతలు
 పెరుగుతున్న బాధ్యతలకు భారమైన బరువులు
పెంచుకున్న మమకారాలతో నిండిన జీవిత యానం 
దిశ మారినా దశ మారని ఒడిదుడుకుల ప్రయాణం ॥

అగమ్యగోచరమైన లక్ష్య సాధనకు
అలుపెరుగని ఆశల పయనం .
ఏ ఆశయం వైపు మళ్ళుతుందో 
తెలీని ప్రయాణం , అదే జీవితం ॥

నాలుగు దశల జీవితంలో 
నచ్చనివి కొన్ని నచ్చినవి కొన్ని
నచ్చనివి  తప్పించుకోలేని బలహీనత
నచ్చినవి పొందాలున్నా పొందలేని నిరాశ ॥

సుఖ దుఃఖాల సాగరంలో సాగే ఎదురీత.
సద్దుబాటుల బాటలో సుఖ సంతోషాల కొరత
జనన మరణాల మధ్య  క్షణ క్షణం పోరాటం. అలుపెరుగని ఆరాటాల  జీవిత ప్రయాణం .॥

*********************************:::


27/07/2022.
శీర్షిక  : ప్రయాణం .
పద్యం : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

నాల్గు దశల పోరు నడిసంద్ర మునహోరు
నచ్చి నట్టి బాట నడచి రాదు.
జనన మరణ కాల జరుగుబా టులజోరు
పాత్ర లెన్నొ జుట్టు పయన మందు.॥

కష్ట నష్ట ములను కావిళ్ళ లోమొాసి
 బాట ముళ్ళ నడకె బ్రతుకు తెరువు.
 క్షణిక సుఖము కొరకు క్షణము క్షణము పోరు 
నిత్య పయన మిదియె  నింద లేల   ॥

జీవి పయన మిదియె జీవిత చక్రంబు
తిరుగు చుండు నెపుడు తిరుగు లేదు
బురద లోన పుట్టు బుజ్జి కమలమొాలె
బ్రతుక సంత సముతొ, భవిత వెలుగు ॥