21/03/2023.
అంశం : యుగాది.
శీర్షిక : నవ యుగాదికి స్వాగతం సుస్వాగతం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర
నవయుగాది వచ్చె నదిగొ పలుకరె చెలి స్వాగతం .
"శోభకృత్" నామముతో శుభములు పంచెడి నేస్తం.
ఆనంద మారోగ్య సంపదలిడు వత్సరం
సంతసాన సంబరాలు చేద్దాము అందరం ॥
ప్రకృతిలో పచ్చదనం, నవ వసంత ఆగమనం
మలయమారుతాన నిండె, వేల పుాల పరిమళం
మావి చిగురు గుబురులలో కోయిల చేసెను గానం .
కిల కిలా రవములతో పక్షులిడె శుభోదయం ॥
మామడాకు తోరణాలు మదిలో ఆనందాలు
అందమైన రంగవల్లు లింటింటి శోభలు .
గుమ్మాలకు పసుపు బొట్లు అంబలు ఆడుగిడేటట్లు
వేల్పులున్న కొలువులో వినిపించెను జేగంటలు ॥
వంటింట పాయసాలు నేతి తీపి వంటలు
ఆరు ఋచుల పచ్చళ్ళవె ప్రతి యింటి వేద్యాలు
ఆనందాలు పంచుకునే బంధుజనుల రాకలు
కలిసి విందారగించు కళ కళ లిడు సందళ్ళు ॥
నవ యుగాది ఆరంభం "శోభకృత్" ఆగమనం
సర్వజనులు కోరినట్టి కోరికలవె సాకారం .
శుభ ఫలితాలిడు సుందర వత్సరమిపు డారంభం
సందడులా సరాగాలె శోభకృతిడు శుభ ఫలితం ॥
కొలువైన దేవతలే కోటి శుభము లిచ్చు దినం
రోగముక్తులై జనులిల భోగమనుభవించు వరం
ఇత్తు, భోగ భాగ్యములని పసిడి లక్ష్మి పలుకు దినం
జగతి వచ్చె నిండుదనం ,జయము లిడే వత్సరం ॥
హామీ : ఈ కవిత నా స్వీయ రచన.
No comments:
Post a Comment