గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక 3.1 కొరకు
అంశం: ఆధునిక సమాజంలో సాహిత్యం పాత్ర
శీర్షిక: రైలు పట్టాలు
పేరు: గుడిపూడి రాధికారాణి
ఊరు: మచిలీపట్నం
*రైలు పట్టాలు*
గేటు చప్పుడైతే ఎవరా అని వంటింట్లోంచి తొంగిచూసిన జానకి మొహం కూతుర్ని చూసి చేటంతైంది.
ఇడ్లీ పిండి కలిపే చేతుల్తోనే సంబరంగా ఇవతలకి వచ్చి ఆమె వెనకగా చూస్తూ, " అల్లుడుగారేరీ?" అంది ఆరాటంగా.
ట్రాలీ బ్యాగ్,లాప్టాప్ బ్యాగ్ పక్కన పడేసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళింది సాహి మౌనంగా.
" ఒక్కదానివే వచ్చావేంటే?" మంచినీళ్ళు అందిస్తూ మళ్ళీ అడిగింది జానకి.
" ఏం? ఇద్దరం వస్తేనే రానిస్తావా? సరే.వెళ్ళిపోతాలే." కస్సుమంది సాహి.
" అదసలే అలిసిపోయి వస్తే నీ గోలేంటి? నోర్మూసుకుని వెళ్ళి మంచి కాఫీ పట్రా. రెస్ట్ తీసుకోనీ." అని భర్త సుధాకర్ అనడంతో అనుమానంగా భయంగా తిరిగి పనిలో పడింది జానకి.
రెండు రోజులు గడిచాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ముభావంగా గడుపుతోంది సాహి.
ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా కూతురు,అల్లుడు మంచి పొజిషన్ లో ఉన్నారని మురిసిపోయే తల్లిదండ్రులకు ఆందోళన కలిగింది.
అల్లుడికి కాల్ చేస్తే రెండుసార్లు కట్ చేసి తర్వాత " తననే అడగండంకుల్" అని ముక్తసరిగా చెప్పి పెట్టేశాడు.
ఏం చేయాలో పాలుపోని జానకి పల్లెనుండి తల్లిని రప్పించింది.
అమ్మమ్మని చూసి సాహి మొహం వికసించింది. మనవరాలిని ఏమీ ప్రశ్నించకుండా తెచ్చిన సున్నుండలు,జంతికలు, మామిడిపళ్ళు ఇచ్చి భోజనంచేసి కాసేపు తాతయ్య కబుర్లు,మామయ్యల విశేషాలు చెప్పింది కనకమ్మ.
నాలుగయ్యిందో లేదో వెళ్ళొస్తానని బయలుదేరింది.
" అదేంటమ్మమ్మా! ఇందాకేగా వచ్చావ్?" అంటూ గారంగా నడుం చుట్టూ చేతులేసింది సాహి.
మనవరాలి బుగ్గలు పుణికి నవ్వి " తాతయ్య నేను లేకుండా ఉండలేరే బంగారం!" అంది మురిపెంగా.
" తాతయ్యకు వంట వచ్చుగా" అనబోయిన సాహి ఈ జవాబుతో ఆగిపోయింది.
" ఎప్పుడూ గొడవలు పడలేదా అమ్మమ్మా! మీరిద్దరూ?" అంది.
" పిచ్చితల్లీ! కాపురమన్నాక కలతలు రావా? చిన్నచిన్న గొడవలూ,అలకలూ బతిమిలాటలూ లేని సంసారం ఉప్పు లేని పప్పు." అంది కనకమ్మ.
" మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు పోగొట్టుకోవాలి? మన ఇగో హర్ట్ చేస్తే ఎందుకు సహించాలి?" అంది సాహి కోపంగా.
" అంతెందుకు? నిన్న నా ముందే నాన్న అమ్మని నోర్మూసుకోమన్నారు.అయినా అమ్మ సిగ్గు లేకుండా నాన్నతో కూర్చుని నవ్వుతూ కాఫీ తాగింది. నావల్ల కాదు బాబూ" అంటున్న సాహికి తెలియకుండానే ఏడుపు వస్తోంది.
చిన్నప్పటినుండి హాస్టళ్ళలో బతికి యంత్రాల్లా చదివి ఇలా అయిపోతోంది తరం అని నిట్టూర్చిన సుధాకర్ అమరావతి కథలు, మిథునం, మరికొన్ని పుస్తకాలు తెచ్చి కూతురికి ఇచ్చాడు.
ఇంతలో తాతయ్య రానే వచ్చాడు.
వారి గిల్లికజ్జాలు చూస్తూ, కాపుర విశేషాలు వింటూ ఆ పుస్తకాలు చదువుతున్న సాహి వారం తర్వాత మెల్లిగా తండ్రితో " అశోక్ తో మాట్లాడాను నాన్నా! బెంగగా ఉంది.వెళ్ళిపోతా. టికెట్ తనే బుక్ చేశాడు. " అంది. కొన్ని డ్రెస్ లు పక్కన ఉంచేసి బుక్స్ ట్రాలీలో సర్దుకుంది.
ఆధునిక సమాజంలో యువత మంచి సాహిత్యానికి దూరమై ఎలా పతనమైపోతున్నారో అని బాధపడుతున్న పెద్దవాళ్ళు వికసించిన మొహాలతో సాహిని సాగనంపారు.
No comments:
Post a Comment