21/05/2022
శీర్షిక : అంతరంగం ఆత్మహత్య చేసుకుంది.
రచన.:.శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
నా కలం లోంచీ అక్షరాలు పదాలుగా ...
పదాలు, వాక్యాలుగా, వాక్యాలు, ..
కవనాలుగా వెలువడుతుా అసత్య
ప్రయాణాన్ని అసహనంగా సాగిస్తున్నాయి ॥
కవన వనంలో రాజకీయాల రసహీన
చరితలకు మంచితనపు మకుటాన్ని తొడుగుతుా
కపటాన్ని కప్పిపుచ్చిన వైనం కదనుతొక్కుతోంది .
నాలోస్వార్ధం నిండిన ధనదాహం చిందులేస్తోంది॥
పట్టం కట్టిన పాలకుల పాగాల్లో పొంచి ఉన్న
మిన్నాగు కొడుతున్న విసపు వేడి గాడ్పుల-
అసత్య వాగ్దానాలకు అమాయకపు నమ్మకాలు
అగ్ని లేని మంటలకు ఆహుతవుతున్నాయి ॥
ఆత్మ విమర్శ చేస్తుా ప్రశ్నిస్తున్న అంతరంగాన్ని
నాలో అహం అడుగడుగునా అణగదొక్కుతున్నాది.
అన్ను మిన్ను కానని అర్ధ లోభం, కప్పుతున్న రంగు
శాలువా మెమొంటోల చప్పట్లకు తలవంచింది ॥
నాలోని అంతరంగం మళ్ళీ హెచ్చరించింది.
ప్రతీ అక్షరం ఒక మంత్రాక్షర బీజమని
మాటే మంత్రంమని , రాతే శాశనమని
శక్తి నిండిన మంత్రాక్షరాలను మైలపరచి
శాపగ్రస్తుడవు కావద్దని శాశిస్తోంది ॥
కవిగా ఎదుగుతున్న నా అహంకారం, నాలో
"మనీషి"ని అవమానించి అడ్డుతొలగిపొమ్మంది
కపట ప్రశంసల కవనాల కానుకలతో పెరుగుతున్న
తుచ్ఛ సంపదతో అహంకారం అడ్డుతోవ పట్టింది ॥
రాతల మీద కోతలు, కోతలకు కోట్ల రుాకలు
పుారి పాకల్లోంచి మారిన భవనాల పేటలు
ధన మదంతో దారుణాలు చేస్తున్నా
పాపాలు కోటలుగా మారిన పట్టు బడని కేసులు, ॥
కవిగా చాలా ఎదిగేను .కానీ
మానవత్వమున్న మనిషిగా దిగజారేను.
ఆక్రోశిస్తున్న నా అంతరంగం ప్రాధేయపడుతోంది.
హ్రదయాలు కదలించే కవిగా ఉద్యమించమని..
మంచి చెడుల విమర్శకు మాధ్యమంగా మారమని.॥
నే రాసిన కవితలకు, అణగారిన భవితలకు---
అందిన మెమొంటోలు,ఆనందంగా అందుకున్నాను
కరపత్రాల సర్పాలను కౌగలించుకున్న శాలువల్లో దాచి ఉంచిన ధనంతో అక్షర హననం కావించేను ॥
దారుణ అసత్యాల అక్షరవిన్యాసాల ,పాపపు
లాభాలకు పరువు బరువును బలిపెట్టేను ॥
ఆస్థి వివాదాల కుటుంబ కలహాలకు ,ఒంటరి
పోరాటకుడినై జంటల దహనాలు చేసేను॥
రక్తాక్షరాల రౌద్ర రాపిడికి నాలో చలనం కలిగింది.
ఒంటరితనపు అసంతృప్తి నన్ను దహించివేస్తోంది.
ఇన్నాళ్ళుా నన్ను ప్రశ్నిస్తున్న నాలో నేను ఎక్కడ..?
కాలదన్నిన అంతరంగ మితృణ్ణి
కాగడా పెట్టి వెదికేను॥ కనపడని మిత్రుణ్ణి
కరుణించమని ప్రాధేయపడ్డాను॥
నాలో పెరిగిన అహం అంతరించింది.
అక్షర కన్యల లక్షల శాపాలకు
నా కలం ముాగబోయింది
నేనుచేసే అక్షరయజ్ఞంలో సమిధై
నా అంతరాత్మ అత్మాహుతి చేసుకుంది .॥
నన్ను ప్రశ్నించే "నెేను" నా నుండి
దుారమయ్యాకా గానీ అసలైన నిజాన్ని
తెలుసుకోలేని నేను నా" లోనున్న "నా కోసం
ఆర్తితో అక్రోశిస్తున్నాను .అక్షర సాక్షిగా...॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment