Tuesday, September 13, 2022

చెట్టు తల్లి.

12/09/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
చిత్రకవిత-
శీర్షిక : చెట్టు తల్లి .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


యుగ యుగాల కవిత చెట్టు చేమల చరిత
చేయు నుపకారమ్ము  చెట్టు వనిత.
పచ్చ తోరణాల పత్రి నిండిన పడతి
సుకపికమ్ముల కొలువు దీర మెచ్చిన యువతి ॥

ప్రాణ వాయువు పంచి బ్రతుకు పెంచెడి మల్లి.
పాడి పంటల నిచ్చు, భువి కల్పవల్లి.
రాజులైనను గాని పేదలైనను యేమి 
బేధ భావములేక పంచు ప్రేమను తల్లి ॥

పశువులకు గ్రాసమై పలువురకు జీవమై
బ్రతుకు తీరు ఘనము తెలియ జేయు 
విత్తు నాటిన నేల వృక్షమై నిలచేది 
పలుక లేకున్నను,నీడ నిచ్చెడు తల్లి ॥

నానాటికిని మారు కాలాన  కల్మషము 
పెరిగె మనిషిలోన  స్వార్ధమేలిన గుణము 
మంచి చెడులను విడచి మహినందు కడు చెలగి
మానవత్వము విడచి మనిషి మారెను భువిని॥

భువిని పాపము పెరిగె తాపమ్ము లవి మరిగె 
నానాటికిని మనిషి మానవత్వము మరచె
తెగనరికె చెట్లను  విడనాడి బంధముల-
కాముకుండై చెలగి వావి వరుసలు మరచె  ॥

పకృతి వనరులు పోయె వికృతి చేష్టలు పెరిగె
భుామి తల్లడిల్లె భువిని ప్రళయము ముంచె
పంట నాశనమాయె చెట్లు కొట్టుకు పోయె
వివశుడైన మనిషి  వీధి దారిని బట్టె ॥

నీట మునిగిన భువిని  నీడ కానగ రాక 
మనిషి కొండలు దాటి , నిలువ, మట్టిని వెదకె
మనిషి మేధలన్ని మట్టిలో కలయంగ
మరుభుాములను జుాచి మనిషి వగచె ॥

మేలు చేయుటె తప్ప కీడు నెరుగని తల్లి
వేటు వేసిన నరుని  కాపాడ వచ్చె
రెండు కొండల మధ్య  నిండు కొమ్మలు జాచి
బాట జుాపె చెట్టు  బ్రతుక మనిషి ॥

చెట్టు తల్లి చేయు  మేలు మరచిన మనిషి
వేసి యడుగుల త్రొక్కి వెడల సాగె
నోరు లేని జంతు జీవరాసుల నీతి
మనిషి కెపుడు తెలియొ వాటి విలువ   ॥

***************************:****







No comments:

Post a Comment