Thursday, December 2, 2021

భక్తి

శీర్షిక  : భక్తికి నిర్వచనం..
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు చెప్పబడ్డాయి.
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం
'అంటుా పోతన తెనిగించిన విధం నవ విధ భక్తి మార్గాలను సుాచిస్తోంది.
పుాజలు, వ్రతాలు ,అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు, నైవేధ్యాలు, ఉపవాసాలు, పారాయణాలు జాగరణలు భక్తిని సాధించటానికి మాధ్యమాలుమాత్రమే.
భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా విశిష్టమైనది.
ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం.
 ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.
 
ప్రతి అవస్థలోను వ్యవస్థలోను, అన్నిటిలోను, అంతటిలోను భగవంతుడ్ని చూడగలగటమే భక్తి. అనుక్షణం ప్రతిక్షణం అనువణువునా ఆ భగవంతుడ్ని హృదయంలో ఉంచుకోగలగటం భక్తి. 

భగవంతుడ్ని అనుభవించటం,అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.
భావనా మాత్రం చేత భగవంతుడిని చేరవచ్చనే బలమైన నమ్మకం భక్తి.

ఇటువంటి నిర్మల భక్తి మనకు కలగాలంటే
స్వీయ పరిశీలన చేసుకోవాలి .స్వీయ పరిశీలన వలన 
చేస్తున్న కర్మలకు ఒక అధికారి మన లోపలే ఉన్నాడనే భావన, మనసుని తప్పు చేయనివ్వదు .
మనసులో ఉన్న భగవానుడు, మనసుని శుద్ది చేయడం మొదలైతే చిత్తశుద్ది ఏర్పడి, మనసు 
 నిర్మలమౌతుంది.
 
 ప్రశాంతమైన ఆలోచనలు కలిగిన మనసు నిర్మల మనస్తత్వంతో మనగలగుతుంది. ఈ ప్రశాంతమైన ఆలోచనే పరమాత్మ స్వరూపం అని తెలుసుకోగలిగితే
భగవంతుడు,  భక్తి , అనే మాటకు అర్ధం మనంతట మనమే తెలుసుకోగలుగుతాము.

భగవంతుడిని ఆరాధించే కొద్ది సేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునియందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తి . ఇటువంటి భక్తి  భగవంతుని ,
భక్తులను దగ్గర చేసే నిజమైన  భక్తి మార్గమని చెప్పుటలో ఏమాత్రము సందేహము 
లేదన్నది నా భావన.

No comments:

Post a Comment