Monday, August 15, 2022

మాతృ వైభవం ( భారత .దేశ దండకం).

మాతృ వైభవం. 
ఇది మా అన్న గారైన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ “పండిత” నేమాని రామజోగిసన్యాసిరావు గారు 
మాతృదినోత్సవంసందర్భంగా 
భరతమాత వైభవాన్ని వర్ణిస్తూచెప్పిన అద్భుత దండకం.
************************
జయ జయ జనయిత్రి! శ్రీభారతక్ష్మాధినేత్రీ! సదా సస్యసంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగాతీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపో భూ ప్రభావ ప్రభాభాసితాంగీ! శుభాంగీ! సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్యప్రతాపాది సల్లక్షణోద్భాసితానంతకీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానంద మూర్తీ!
శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీశివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీభూషితా! నిత్యసంతోషితా! స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్యప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితా పూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా! లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయకశ్రేణి సంవర్ధితాశేష ఖండాంతరవ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోకసంపూజితా! జ్ఞానవైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్యతేజోన్వితా! భారతక్ష్మామహాదేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహాపారిజాతా! నమోవేదభూమే - నమఃపుణ్యభూమే - నమోధర్మభూమే - నమోధన్యభూమే - నమోవీరభూమే -నమోమాతృభూమే -నమస్తే - నమస్తే - నమస్తే - నమ:. జైశ్రీరాం.జైహింద్.
****:::::******************

మీకు   నచ్చితే వీలైతే  ఆగస్టు ౧౫ నాడు చదవండి.  ఆడియోలు పెట్టండి. 

జై భారత్ మాతా 🙏🙏🙏

No comments:

Post a Comment